: భూసేకరణ ఎలా చేయాలో కూడా పవన్ చెబితే బాగుంటుంది: యనమల
నవ్యాంధ్ర రాజధానిలో కొన్ని గ్రామాల్లో భూసేకరణ చేపట్టవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరడంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భూసేకరణ ఎలా చేయాలో కూడా పవన్ చెబితే బాగుంటుందన్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే భూములు చాలా అవసరమని, హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు ఇచ్చినందునే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. రాజధాని మధ్యలో ఉన్న భూములను సేకరించకుండా విడిచిపెట్టడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు. అయితే భూములు లేకుండా త్రిశంకు స్వర్గం నిర్మించడానికి మనమేమి విశ్వామిత్రులం కాదని యనమల ఎద్దేవా చేశారు. ఏపీఎన్జీవో నేతలతో సమావేశం ముగిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడారు. స్థానికత విషయంలో న్యాయ సలహా తీసుకొని కేంద్రం వద్దకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ రద్దు కాదని, ప్రజాభీష్టం మేరకు ముందుకెళతామని చెప్పారు. నూతన రాజధానికి వెళ్లేందుకు ఉద్యోగులు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిపారు. వారి పిల్లలకు స్థానికత విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వడం న్యాయమేనన్నారు.