: సిలికాన్ వ్యాలీలో 'నియామక యుద్ధం'... ఐటీ దిగ్గజాలపై స్టార్టప్ ల వల!


ఇప్పుడు నడుస్తున్నది స్టారప్ కంపెనీల యుగం. ఓ చిన్న వినూత్న ఆలోచన యువతను అందలాలు ఎక్కిస్తోంది. ఆలోచన ఎంత బాగున్నా, దాన్ని పట్టాలపై పరుగులు పెట్టించాలంటే, ఎంతో నైపుణ్యమున్న లీడర్లు, వారి మాటలను పాటించే ఉద్యోగులు తప్పనిసరి. అందుకే స్టార్టప్ కంపెనీలు, అందునా బిలియన్ డాలర్ల కన్నా అధిక విలువైన కంపెనీలు సిలికాన్ వ్యాలీపై పడ్డాయి. టెక్ దిగ్గజాలపై, ముఖ్యంగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై పడ్డాయి. గూగుల్ ను వదిలి వచ్చి తమ సంస్థలో చేరితే అంతకుమించిన వేతనం, ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. మ్యాపింగ్ వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ కంపెనీలకు ఎంతో అవసరం. అందుకే ఇవి అత్యధిక నైపుణ్యమున్న ఉద్యోగుల కోసం గూగుల్ పై పడ్డాయి. దాదాపు 50 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉబెర్ గడచిన సంవత్సరం వ్యవధిలో పలువురు గూగుల్ ఉద్యోగులను తన సంస్థకు రప్పించుకోవడంలో విజయం సాధించింది. వీరిలో కొందరు టాప్ పొజిషన్ ఉద్యోగులూ ఉన్నారు. రెంటల్ స్టార్టప్ ఎయిర్ బీఎన్బీ సైతం ఇదే పని చేస్తోంది. దాదాపు 100 మంది కింది స్థాయి సిబ్బందిని ఈ కంపెనీ లాక్కెళ్లింది. ఒక్క ఉద్యోగులనే కాదు. నాన్ టెక్నికల్ విభాగంలో, అంటే ఉద్యోగులకు భోజనాలు తయారు చేసే చెఫ్ లు, గూగుల్ ఆఫీస్ బాయ్ లను సైతం తీసుకెళ్లిపోతున్నారు. గూగుల్ లో పనిచేస్తున్న చెఫ్ లు అల్విన్ సాన్ ను ఉబెర్, రాఫెల్ మాన్ ఫోర్ట్ ను ఎయిర్ బీఎన్బీ మంచి ఆఫర్లిచ్చి మరీ నియమించుకున్నాయి. ఇప్పుడు ఉద్యోగుల మార్కెట్ నడుస్తోందని ఇటీవలే గూగుల్ ను వీడి వెళ్లిన రోడ్రిగో ఐపిన్స్ (28) అభిప్రాయపడ్డాడు. తాను ఓ మొబైల్ గేమింగ్ వీడియో స్టార్టప్ లో చేరానని, ఆ సంస్థ నుంచి "కొత్త ఉద్యోగం కావాలా?" అని తనకు రోజుకు రెండు సార్లు మెయిల్ వచ్చేదని తెలిపాడు. తాను ఏ కంపెనీలో పని చేయాలన్న విషయం తన వ్యక్తిగతమని అన్నాడు. సిలికాన్ వ్యాలీలోని పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగులకు ఎర వేయడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే, ఇటీవలి కాలంలో అది మరింతగా ఎక్కువైంది. దీంతో దీర్ఘకాలంగా పనిచేస్తూ, అనుభవం గడించుకున్న ఉద్యోగులను వదులుకోరాదని భావిస్తున్న దిగ్గజ కంపెనీలు వారికి ప్రమోషన్లు, మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. స్టార్టప్ సంస్థలను ట్రాక్ చేసే రీసెర్చ్ సంస్థ 'సీబీ ఇన్ సైట్స్' తెలిపిన వివరాల ప్రకారం 124కు పైగా స్టార్టప్ కంపెనీలు అనుభవమున్న ఉద్యోగుల కోసం 'నియామక యుద్ధం' చేస్తున్నాయి. సదరు ఉద్యోగి తప్పనిసరైతే ఆరంకెల వేతనం, సంస్థలో వాటాలు ఇచ్చేందుకు ఈ కంపెనీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. గూగుల్ తో పాటు ట్విట్టర్, ఎల్ప్ తదితర సంస్థల ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News