: ‘ఆ నిధులు’ వెనక్కిచ్చేస్తాం... కేంద్రం లేఖతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ సర్కారు
రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక్కసారిగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. అందుకు కారణమేంటో తెలుసా? తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయ పన్ను చెల్లించలేదన్న కారణంగా రాష్ట్ర ఖజానా నుంచి రూ.1,257 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి మళ్లించడమే. రాష్ట్ర ప్రభుత్వానికి మాటమాత్రంగానైనా సమాచారం ఇవ్వకుండా జరిగిన ఈ నగదు బదిలీ కారణంగా రెండు నెలల పాటు రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఉద్యోగుల వేతనాలు మినహా 'మిషన్ కాకతీయ' పనుల చెల్లింపులను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. తక్షణమే ఆ నిధులను వెనక్కివ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. అయితే ఎట్టకేలకు కేంద్రం, తెలంగాణ సర్కారు మొరను ఆలకించినట్లుంది. బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఖాతా కింద జమ చేసుకున్న నిధులను వెనక్కిచ్చేయనున్నట్లు నిన్న కేసీఆర్ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. దీంతో తెలంగాణ సర్కారు కాస్తంత ఊపిరి పీల్చుకుంది.