: ఆశించిన మెజారిటీ రావడం లేదేమిటి?... కుప్పం నేతలతో చంద్రబాబు రివ్యూ


ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా తన పార్టీ నేతలతో జరిపిన సమీక్షలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిత్యం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడమే కాక తరచూ తాను అక్కడ పర్యటిస్తున్నా, ఆశించిన మెజారిటీ ఎందుకు రావడం లేదన్న విషయంపై ఆయన స్థానిక నేతలను ఆరా తీశారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత గడప దాటకున్నా, ఆమె పోటీ చేసిన స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాను ఇంత చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. స్థానిక నేతలు పార్టీ కార్యకర్తలను పట్టించుకోని ఫలితంగానే ఆశించిన మెజారిటీ రావడం లేదన్న వాదనపై ఏకీభవించిన ఆయన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసిన కార్యకర్తలను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. ఇకనైనా నియోజకవర్గంలో పార్టీ పురోభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News