: 'ఓటుకు నోటు' కేసు చార్జిషీట్ లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును 22సార్లు ప్రస్తావించారు. ఈ కేసులో ఆయనను నిందితుడని డైరెక్టుగా చెప్పనప్పటికీ, వివిధ సందర్భాల్లో చంద్రబాబు పేరును పేర్కొన్నారు. ఈ ఛార్జిషీట్ ప్రతి వెలుగులోకి వచ్చింది. కేసు మొదటి రోజు నుంచి జరిగిన అన్ని విషయాలతో పాటు, అంతకుముందు జరిగిన సంభాషణలు, సేకరించిన ఆధారాలను ఏసీబీ ఈ చార్జిషీట్ లో ప్రస్తావించింది. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదికల వివరాలనూ తెలిపింది. కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ లు చంద్రబాబు ఆదేశాల మేరకే అడుగులు వేశారని పేర్కొంది. బాబు ప్రోద్బలంతోనే తెదేపా అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే రూ. 2 కోట్లు ఇస్తామని, జెరూసలేం పంపుతామని స్టీఫెన్ సన్ కు ఆశ చూపారని, ఒక దశలో బాబు వద్దకు తీసుకెళ్లి కలిపిస్తామని చెప్పినప్పటికీ, స్టీఫెన్ సన్ అంగీకరించలేదని, అందువల్లే చంద్రబాబు తరపున రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సంప్రదింపులు మొదలు పెట్టారని వివరించింది. కేసులో సాక్ష్యాలుగా, స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ సంభాషణ, రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ ల మధ్య జరిగిన సంభాషణల వివరాలు జతపరిచినట్టు తెలిపింది. అన్ని రకాలుగా చూసుకుంటామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఇందులో వివరించింది. ఏపీలో తమ ప్రభుత్వమే ఉన్నందున, అవసరమైతే స్టీఫెన్ సన్ ను మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీని చేస్తామని రేవంత్ ప్రలోభపెట్టారని తెలిపింది. తమ ఎదుట హాజరు కావాలని జెరూసలేం మత్తయ్యకు నోటీసులు ఇస్తే, ఆయన 'సారీ సర్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని టీడీపీ నాయకులు చెప్పారు. నేను రేపు ఉదయం ఫోన్ చేస్తాను. నేను బెయిల్‌కు అయ్యే ఖర్చుల గురించి చూసుకోవాలి' అని ఏసీబీ అధికారికి సందేశం పంపారని చార్జిషీట్లో తెలిపారు. కాగా, చంద్రబాబు పేరు నిందితుల జాబితాలో చేర్చనప్పటికీ, కేసు వెనుక ఆయన ప్రమేయం ఉన్నట్టేనని చార్జిషీట్ వివరాలను బట్టి తెలుస్తోందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.