: వ్యూహం మార్చేది లేదంటున్న టీమిండియా మేనేజ్ మెంట్
గాలే టెస్టులో అనూహ్యరీతిలో పరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టుకు సరికొత్త వ్యూహాలతో బరిలో దిగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ, జట్టు మేనేజ్ మెంట్ మాత్రం వ్యూహాలు మార్చేది లేదని, సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లలోనూ దూకుడు మంత్రాన్నే పఠిస్తామని చెబుతోంది. సోమవారం కొలంబోలో జట్టు డైరక్టర్ రవిశాస్త్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. మిగిలిన రెండు టెస్టుల్లోనూ జట్టు ఆటతీరులో మార్పు ఉండదని, భయం లేని క్రికెట్ ఆడేందుకు ప్రాధాన్యమిస్తామని రవిశాస్త్రి స్పష్టం చేశారు. "తొలి మ్యాచ్ లో ఎలా దూకుడైన ఆట ఆడామో, అదే ఆటను కొనసాగిస్తాం. తొలి మ్యాచ్ లో ఓ తప్పు చేశాం. దాన్ని పునరావృతం కానివ్వం" అని తెలిపారు. ఐదుగురు బౌలర్ల ఫార్ములా విఫలమైంది కదా... దాన్నే కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా... ఇలాంటి ఎత్తుగడలను కోహ్లీ క్రమంగా నేర్చుకుంటాడని, ఎంత ఎక్కువ ఆడితే అంత నేర్చుకోవచ్చని బదులిచ్చారు. టీమిండియా ఎప్పుడోగానీ ముగ్గురు స్పిన్నర్లతో ఆడదని, అశ్విన్ బాగానే రాణించినా, మిగిలిన వాళ్లు కూడా రాణించి ఉండాల్సిందని పేర్కొన్నారు.