: శ్రీలంక సిరీస్ నుంచి ధావన్ ఔట్
ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ధావన్ కుడిచేతికి గాయమైంది. వైద్య పరీక్షల్లో ఎముకలో వెంట్రుకవాసి పగులు కనిపించడంతో అతడికి చికిత్స అవసరమని నిర్ణయించారు. గాయం నుంచి కోలుకునేందుకు ఆరు వారాలు పడుతుందని భావిస్తున్నారు. ధావన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేదీ తెలియరాలేదు. అంతకుముందే ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీని జట్టులోకి పిలిచిన నేపథ్యంలో, మరో ఆటగాడిని జట్టులోకి తీసుకునే విషయమై స్పష్టతలేదు. కాగా, ఫామ్ లో ఉన్న ధావన్ గాయంతో వైదొలగడం టీమిండియాకు ఎదురుదెబ్బేనని భావించాలి. లంక పిచ్ లపై భారీ స్కోర్లు నమోదు చేయాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం కీలకం. ధావన్ గైర్హాజరీలో ఓపెనర్ గా ఎవరిని బరిలో దింపాలన్న విషయమై మేనేజ్ మెంట్ కసరత్తులు చేస్తోంది.