: స్వామిగౌడ్, నేను సంతోషంగా లేము: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన అసంతృప్తిని మరోసారి బహిరంగంగా వెళ్లగక్కారు. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి చేపట్టానని... అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా తాను, శాసనమండలి ఛైర్మన్ గా స్వామిగౌడ్ ఉన్నప్పటికీ తమకు ఎలాంటి సంతోషం లేదని తెలిపారు. ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ లోకి వచ్చిన వారు ఎక్కడో ఉన్నారని... మధ్యలో వచ్చిన వారు మాత్రం పార్టీలో ముందు వరుసలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలతో సభకు హాజరైన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.