: అమెరికన్ బందీపై ఐఎస్ఐఎస్ నేత అబూ బకర్ అల్-బగ్దాదీ అత్యాచారం
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు బందీగా పట్టుబడిన అమెరికన్ మహిళ కైలా ముల్లర్ ను ఉగ్రవాద నేత అబూ బకర్ అల్-బాగ్దాదీ అత్యాచారం చేశాడట. ఈ విషయాన్ని అదే ఇంట్లో లైంగిక బానిసగా ఉండి తప్పించుకు వచ్చిన ఓ యాజిడి యువతి వివరించింది. కైలాను బలవంతగా అబూ బకర్ వివాహం చేసుకున్నాడని, పలుమార్లు బలవంతం చేశాడని 'ది ఇండిపెండెంట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అబూ బకర్ ఆ ఇంటికి వచ్చినప్పుడెల్లా, తమను ఖైదీల మాదిరి గదిలో బంధించేవారని, కైలాను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లే బకర్, అత్యాచారానికి పాల్పడేవాడని తెలిపింది. ఆగస్టు 2013లో కైలాను, ఆమె స్నేహితుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రఖాపై జోర్డాన్ యుద్ధవిమానాలు దాడులు జరిపినప్పుడు కైలా మరణించినట్టు తెలుస్తోంది. ఆమె మరణంపై అధికారిక సమాచారం మాత్రం లేదు. కాగా, అబూ బకర్ సైతం మరణించినట్టు అనధికార వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.