: ఎకరం స్థలం తగ్గడంతో ఐఐటీ అర్హత కోల్పోయిన మైసూర్!
ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని మైసూర్ తృటిలో కోల్పోయింది. ఐఐటీ ఏర్పాటుకు నిబంధనల ప్రకారం 500 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి వుండగా, కర్ణాటక ప్రభుత్వం 499 ఎకరాలను మాత్రమే కేటాయించింది. ఇదే సమయంలో రాయచూర్ లో ప్రతిపాదిత ఐఐటీకి 688 ఎకరాలు, ధార్వాడ్ లో 600 ఎకరాలు సిద్ధంగా ఉందని తెలిపింది. దీంతో ఆ పట్టణాలకు ఐఐటీలను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ సహా పాట్నా, జోధ్ పూర్, భువనేశ్వర్, ఇండోర్, రోపార్, గాంధీనగర్, మండి ప్రాంతాల్లో ఐఐటీలు తాత్కాలిక క్యాంపస్ లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాలన్నీ తొలుత స్థలం కేటాయింపునకు అంగీకరించి, ఆపై స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇదే తరహా ఘటన మైసూరు విషయంలో జరగరాదనే తాము నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. కర్ణాటక మాత్రం తమ రాష్ట్రానికి ఐఐటీ వస్తుందనే అంచనా వేస్తోంది.