: బంగారం ధర ఎటువైపు!


గత నెలలో రూ. 25 వేల దిగువకువచ్చిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర తిరిగి రూ. 26 వేలను దాటింది. గత వారంలో కొద్దిగా తగ్గినా, తిరిగి మళ్లీ పెరిగింది. చైనా కరెన్సీ యువాన్ విలువను తగ్గిస్తూ, ఆ దేశం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అయితే, బంగారం ధరలో తగ్గుదల తాత్కాలికమే అంటున్నారు బులియన్ నిపుణులు. గత నెలలో బంగారం ధరలు తగ్గినప్పుడు ఆభరణాల దుకాణాల్లో సందడి నెలకొంది. అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి కూడా. ఆపై శ్రావణ మాసం వస్తే ధరలు పెరుగుతాయని విశ్లేషకులు వేసిన అంచనాలు నిజమయ్యాయి. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,100 డాలర్లకు పైకి చేరింది. పుత్తడి ధరలను భవిష్యత్తులో దానికుండే డిమాండు, అమెరికా వడ్డీ రేట్లు, చైనా కరెన్సీలు ప్రభావితం చేయనున్నాయి. యూఎస్ లో నిరుద్యోగ రేటు 20 సంవత్సరాల కనిష్ఠానికి రావడంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో జరిగే ఫెడ్ రిజర్వ్ భేటీ అనంతరం వడ్డీ రేట్లు పెంచితే, బంగారం ధరలు రూ. 24 వేల వరకూ తగ్గవచ్చని సమాచారం. దీనికితోడు బంగారం డిమాండ్ తో పోలిస్తే సరఫరా అధికంగా ఉండటంతో ధరల్లో ఒత్తిడి నెలకొనవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తమ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా పెద్దఎత్తున బంగారాన్ని విక్రయించవచ్చని తెలుస్తోంది. అది జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుంది. అయితే, భవిష్యత్తులో బంగారం ధరల పయనంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 10 గ్రాముల ధర రూ. 22 వేల నుంచి రూ. 23,500 వరకూ పతనం కావచ్చని కొందరు అంటుంటే, ఏపీ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ మాత్రం ఆ స్థాయిలో పతనం ఉండబోదని తేల్చి చెబుతోంది. వచ్చే పది రోజుల్లో బంగారం ధర మరింతగా పెరగనుందని అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. వెండి ధర కిలోకు రూ. 37 వేల వరకూ పెరగవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News