: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ విద్యార్థి మృతి


అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ విద్యార్థి కన్నుమూశాడు. నల్లగొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి (27) సోదరి ప్రియాంకతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. అక్కడే ఎమ్మెస్ విద్యను అభ్యసిస్తున్నాడు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మజ హైదరాబాదులో ఉంటున్నారు. కాగా, ఆగస్టు 2న ఎల్లోస్టోన్ పార్క్ నుంచి అభిషేక్ తన మిత్రులు కృష్ణకాంత్, ఆదిత్యలతో కలిసి కాలిఫోర్నియాకు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో, తీవ్రగాయాలపాలైన వారిని నేషనల్ పార్క్ ఆసుపత్రిలో చేర్చారు. అభిషేక్ రెడ్డి చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు. అతని మిత్రులు చికిత్స పొందుతున్నారు. మరో 10 రోజుల్లో చదువు పూర్తిచేసుకోనున్న అభిషేక్ రెడ్డి సెప్టెంబరులో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా, ఇంతలోనే ప్రమాదం సంభవించింది. దాంతో, అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, అభిషేక్ తండ్రికి ఇటీవలే హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అభిషేక్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News