: మంత్రి కామినేనికి అనంత జర్నలిస్టుల నిరసన
అనంతపురంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేనికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లా పర్యటన సందర్భంగా జర్నలిస్టులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖకు సంబంధించి జర్నలిస్టులు పలు ప్రశ్నలను సంధించారు. ఈ క్రమంలో, ఒకానొక దశలో సహనం కోల్పోయిన కామినేని... మీ కడుపు మంట తగ్గించుకునేలా ప్రశ్నలు వేయవద్దని అసహనం వ్యక్తం చేశారు. ఈ మాటలతో జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత మంత్రి కాస్త మెత్తబడ్డారు. బెంగళూరులో విమానం ఎక్కాలని హడావుడిగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.