: విచారణకు రాకుండా, పరారీలోనే 'ఓటుకు నోటు' నిందితులు!
ఓటుకు నోటు కేసులో తాజాగా తెలంగాణ ఏసీబీ నోటీసులు అందుకున్న వారెవరూ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసులోని నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో నోటీసులు అందుకున్న లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి, జిమ్మిబాబులు విచారణకు ఇంతవరకూ హాజరు కాలేదు. నేడు ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జిమ్మీబాబుకు గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రాలేదు. కాగా, జిమ్మీబాబు రాష్ట్రం దాటి వెళ్లగా, కొండల్ రెడ్డి ఓ తెదేపా నేత ఇంట్లో ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. కొందరు నేతలు జిమ్మీ బాబుకు ఆర్థిక సహాయం చేస్తున్నారని టీ-ఏసీబీ అనుమానిస్తోంది. నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం.