: పప్పుధాన్యాలు ఆకాశానికి, టోకు ధరలు అట్టడుగుకు!


ఇండియాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాడు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం, పప్పుధాన్యాల ధరలు గణనీయంగా పెరుగుతుంటే, మిగతా ఉత్పత్తుల టోకు ధరలు మాత్రం పడిపోతున్నాయి. హోల్ సేల్ ధరల విభాగంలో వరుసగా తొమ్మిదో నెలలోనూ ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. గడచిన జూన్ లో 2.4 శాతం వరకూ తగ్గిన ధరలు జూలైలో 4.05 శాతం మేరకు పడిపోయాయి. చాలా నెలల తరువాత ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద జూలై ద్రవ్యోల్బణం 5.41 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో చిల్లర ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయిలో 3.78 శాతానికి చేరింది. ఈ నెలలో ద్రవ్యోల్బణానికి 'విలన్'గా నిలిచింది పప్పుధాన్యాలు మాత్రమే. గత సంవత్సరంతో పోలిస్తే, జూన్ లో 33.67 శాతం పెరిగిన పప్పుధాన్యాల ధరలు, జూలైలో 35.75 శాతానికి చేరి సామాన్యుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెలలో పాల ధర 5.18 శాతం నుంచి 5.30 శాతానికి పెరగగా, గుడ్లు, మాంసం, చేపలు తదితరాల ధరలు 2.25 శాతం తగ్గాయి. పంచదార ధర ఏకంగా 17.48 శాతం తగ్గింది. రైతులకు చెల్లింపులు జరిపేందుకు మిల్లర్లకు సులభ రుణాలిచ్చేందుకు కేంద్రం అంగీకరించడం, పెట్రోల్ లో ఇథనాల్ ను మరింత ఎక్కువగా వాడేందుకు తీసుకున్న నిర్ణయాలు పంచదార ధర తగ్గడానికి దోహదపడ్డాయి. నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయల ధర 0.49 శాతం తగ్గింది. ఉల్లి ద్రవ్యోల్బణం జూన్ లో 18.54 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు సహకరిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News