: స్టార్ హోటళ్లలో ఏపీ మంత్రుల బసపై నిషేధం... ప్రభుత్వ అతిథి గృహాల్లోనే ఉండాలని ఆదేశం
విజయవాడ స్టార్ హోటళ్లలో ఏపీ మంత్రుల బసపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి ప్రభుత్వ అతిథి గృహాల్లోనే నివాసం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు విజయవాడ, గుంటూరు నగరాల్లోని అన్ని శాఖల అతిథి గృహాలకు మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీకి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఇదే సమయంలో ఉన్నతాధికారుల నివాసాల కోసం అద్దె రేట్లను సవరించారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ మొదటి, రెండో అంతస్తులను సమావేశ మందిరాలుగా మారుస్తామని చెప్పారు. టూరిజం థరమ్ పార్క్, సబ్ కలెక్టర్ సమావేశ మందిరాన్ని సమీక్షలకు వినియోగించుకోవాలన్నారు. అంతేగాక, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి రెండు నెలల్లో విజయవాడకు ఉద్యోగులను తరలించాలని నిర్ణయించినట్టు యనమల తెలిపారు. ఉద్యోగులకు నివాస, కార్యాలయ వసతుల ఏర్పాట్లను జవహర్ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ఉద్యోగుల కోసం 10వేల ఇళ్లను నిర్మించేందుకు హడ్కో ముందుకొచ్చిందని యనమల వివరించారు.