: మరణంలోనూ వీడని స్నేహం!
వారిద్దరూ ప్రాణ స్నేహితులు. కలిసి పెరిగారు. కలిసే పనులకు వెళ్లేవారు. చివరికి మరణంలోనూ వారి స్నేహబంధం తెగలేదు. రెండు కుటుంబాలను తీరని విషాదంలోకి నెట్టివేసిన ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కొత్త వలస సమీపంలోని చింతలదిమ్మెలో జరిగింది. రెండు రోజుల భారీ వర్షం తరువాత పనిలోకి వెళ్లాలో వద్దో తెలుసుకునేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు దాసరి గాలితాత (28), రొంగలి అప్పారావు (27), తిరుగు ప్రయాణంలో చెరువులో చేపలు పట్టేందుకు దిగారు. ఉపాధి హామీ పనుల నిమిత్తం చెరువులో తవ్విన గుంతలో ఒకరు పడిపోగా, అతడిని కాపాడే క్రమంలో రెండో వ్యక్తి కూడా పడిపోయాడు. వీరిద్దరికీ ఈతరాదని కుటుంబ సభ్యులు విలపిస్తూ తెలిపారు. గాలితాతకు భార్య, మూడేళ్ల కుమార్తె ఉండగా, అప్పారావుకు ఏడాది క్రితమే వివాహమైంది. కాగా, చెరువులో ఇద్దరూ చేతులు పట్టుకునే మరణించి ఉండటం చూపరులను కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.