: చలాకీ చంద్రబాబు!... సింగపూర్ 'ఫైన్', అశోక్ ధూమపానంపై చతురోక్తులు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుది ఒకింత గంభీరమైన రూపమే. ఎప్పుడో తప్పించి ఆయన నవ్వుతున్న ఫొటోలను మనం చూడలేం. ఈ విషయంలో మిగతా నేతలతో పోలిస్తే చంద్రబాబు కాస్తంత భిన్నంగానే ఉంటారు. ఇక సభలూ, సమావేశాల్లో ఆయన మరింత గంభీరంగా కనిపిస్తారు. అయితే నిన్న విజయవాడలో సీఐఐ, కోడ్ ఫర్ ఏపీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో మాత్రం ఆయన చలాకీగా కనిపించారు. చంద్రబాబు చతురోక్తులతో ఈ సదస్సుకు హాజరైన వారంతా ఉల్లాసంగా గడిపారు. సింగపూర్ ను ఫైన్ (మంచి) దేశమని చంద్రబాబు పేర్కొనగా, అంతా అవుననే తలూపారట. అయితే, ఆ తర్వాత ‘ఫైన్’ అంటే మంచి కాదని, 'జరిమానా' అని చంద్రబాబు వివరించడంతో, ఆయన విసిరిన 'పన్' అర్థమై, సభికులు ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తరహా కఠిన నిర్ణయాలు తీసుకున్న కారణంగానే సింగపూర్ లో అభివృద్ధి, క్రమశిక్షణ కలగలసిపోయాయని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ధూమపానాన్ని సైతం ప్రస్తావించారు. తాను సీఎం అయిన తొలినాళ్లలో నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు తదితరులతో కలిసి సింగపూర్ వెళ్లానని చంద్రబాబు చెప్పారు. అక్కడి జరిమానాలకు భయపడ్డ అశోక్ సింగపూర్ లో ఉన్నంత కాలం సింగిల్ సిగరెట్ కూడా కాల్చలేదని తెలిపారు. అదేంటని తాను ఆరా తీస్తే, సిగరెట్ కాలిస్తే సింగపూర్ 500 డాలర్ల జరిమానా విధిస్తుందని, అంత డబ్బు తన వద్ద లేదని అశోక్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. 'అయితే అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక్ తిరిగి తన అలవాటును కొనసాగించారనుకోండి' అంటూ చంద్రబాబు చెప్పడంతో సదస్సులో మళ్లీ నవ్వులు పూశాయి.