: యాక్సిస్ బ్యాంకుల నుంచి 'కాంటాక్ట్ లెస్' కార్డులు... పిన్, పాస్ వర్డ్ లేకుండా లావాదేవీలు
దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సేవల సంస్థ యాక్సిస్ బ్యాంకు 'కాంటాక్ట్ లెస్' డెబిట్, క్రెడిట్ కార్డులను, బహుళ కరెన్సీ ఫారెక్స్ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని వాడటం ద్వారా, రూ. 2 వేలలోపు లావాదేవీలను సంప్రదింపులు లేకుండానే పూర్తి చేసుకోవచ్చు. అంటే, పిన్ నంబర్, ఓటీపీ, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ వంటివి వాడకుండా వస్తు కొనుగోళ్లు, నగదు చెల్లింపులు జరపవచ్చు. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన విధివిధానాల ప్రకారం తాము ఈ కార్డులను జారీ చేస్తున్నట్టు యాక్సిస్ వెల్లడించింది. ఇండియాలోని కార్డు లావాదేవీల్లో 60 శాతం వరకూ రూ. 2 వేలకన్నా తక్కువే ఉన్నాయని గుర్తు చేస్తూ, ఈ విధానాన్ని ప్రస్తుతం ఎంపిక చేసిన మర్చంట్ల వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, మౌలిక వసతుల కల్పన తరువాత 50 వేల వరకూ మర్చంట్లను భాగస్వామ్యం చేస్తామని వివరించింది. ప్రస్తుతం బ్యాంకు ప్రీమియం ఖాతాదారులకు మాత్రమే క్రెడిట్ కార్డులు ఇస్తున్నామని, త్వరలో మిగతా సెగ్మెంట్లలోని కస్టమర్లకూ అందిస్తామని పేర్కొంది.