: రూ. 60 వేలకు వివాహితను కొని, రూ. 50 వేలకు అమ్మేశాడు!
కట్టుకున్న భార్యను అంగడి సరుకుగా భావించిన ఓ దుర్మార్గుడు రూ. 60 వేలకు విక్రయిస్తే, కొనుగోలు చేసిన వ్యక్తి, తన కోరిక తీరాక మరొకడికి రూ. 50 వేలకు అమ్మేశాడు. సభ్యసమాజం తలవంచుకునేలా చేసిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన దాసరా మారుతా అనే మహిళకు ఆర్మూరుకు చెందిన రాజుతో 2006లో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఏడాది క్రితం బాన్సువాడకు చెందిన మల్లయ్య అనే వ్యక్తికి తన భార్యను రూ. 60 వేలకు విక్రయించిన రాజు, ఆపై తన అక్క కూతురిని వివాహం చేసుకుని తన పిల్లలతో కలసి కాపురం పెట్టాడు. కొంతకాలం తరువాత ఆమె సైతం అతడిని విడిచి వెళ్లింది. ఈ నేపథ్యంలో మారుతా సొంత గ్రామమైన జానకం పేటకు బుధవారం నాడు రాజు రావడంతో, ఆమె తల్లిదండ్రులు పిల్లలను గుర్తు పట్టి, నిలదీసి అడిగేసరికి అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మల్లయ్యను ప్రశ్నించడంతో తాను మరో వ్యక్తికి రూ. 50 వేలకు మారుతాను అమ్మేసినట్టు తెలిపాడు. దీంతో అవాక్కయిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పూర్తి విచారణ జరుపుతున్నారు.