: పొలిటికల్ వార్... నేతల సిబ్బందికీ కేసుల ఇబ్బంది!


"నేను ఫలానా రాజకీయ నేత వద్ద పనిచేస్తున్నాను" అని గర్వంగా చెప్పుకోవడం వరకూ బాగానే ఉంటుంది. అదే సదరు రాజకీయ నేత ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే, అప్పుడు వారి దగ్గర పనిచేసేవారికీ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు', 'ఫోన్ ట్యాపింగ్' కేసుల్లో విచారణ పర్వం నేతల నుంచి వారి వద్ద పనిచేస్తున్న సిబ్బంది వద్దకు చేరింది. ఏపీ, తెలంగాణల్లోని ప్రముఖ నేతల డ్రైవర్లు, గన్ మెన్లు కేసుల వలలో చిక్కుకుంటున్నారు. ఓటుకు నోటు కేసు ఒకరిద్దరి ఆలోచన కాదని, ఇది పూర్తి స్థాయి వ్యవస్థీకృత నేరమని భావిస్తున్న తెలంగాణ ఏసీబీ, ఒక్కొక్కరికీ నోటీసులు జారీ చేస్తూ ముందుకు పోతోంది. తెలుగు ప్రభుత్వాల మధ్య పోటాపోటీ 'పొలిటికల్ వార్' జరుగుతున్న నేపథ్యంలో, తామేమీ తక్కువ తినలేదన్నట్టు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో, చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ, ఏపీ సర్కారు ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసి దూసుకుపోతోంది. మరోపక్క ఇప్పటికే రేవంత్ రెడ్డి డ్రైవర్ ను ప్రశ్నించిన ఏసీబీ, ఇప్పుడు తాజాగా తెదేపా యువనేత లోకేష్ కారు డ్రైవరుకు నోటీసులు పంపింది. ఇదే సమయంలో, తనతో కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్లు తనతో బేరసారాలు ఆడారని మత్తయ్య పెట్టిన కేసుపై విచారించిన పోలీసులు, అది నిజమేనని నిర్థారణకు వచ్చి వారికి నోటీసులు ఇచ్చారు. ఇంకోవైపు ఒడిసాకు చెందిన వ్యాపారి కిడ్నాప్ కేసులో టీ-ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ మెన్ కు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు తిరుగుతున్నారు. నేతలు నడిపిన చర్చల వివరాలు నిత్యమూ వారి వెంట ఉండే సిబ్బందికి తెలిసి వుంటాయని అటు ఏసీబీ, ఇటు సీఐడీ భావిస్తున్నాయి. నేతలు ఒకరిని ఒకరు కలుసుకునే క్రమంలో వీరు కీలకమని, వీరిని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని అధికారులు అంటున్నారు. దీంతో మరింతమంది నేతల సిబ్బందికి ఇబ్బందులు తప్పేలా లేవు.

  • Loading...

More Telugu News