: అన్నగారి సంతా... మజాకా!
టమోటా, బెండకాయలు, దోసకాయలు, దొండకాయలు కిలో రూ. 10; బీరకాయలు, చిక్కుడు కాయలు, వంకాయలు రూ. 15; పొట్లకాయ, అరటికాయ ఒక్కోటి 5; గోంగూర నుంచి బచ్చలికూర వరకూ 3 కట్టలు రూ. 10... ఏ కాలం నాటి ధరలివి, అని అనుకుంటున్నారా? తాజావే! 100 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి. ఇంకాసిని ఎక్కువే తెచ్చుకోవచ్చు కూడా. ఎక్కడో తెలుసా? ప్రకాశం జిల్లా అద్దంకి మార్కెట్ యార్డులో. యార్డు కాంపౌండులోనే ప్రతి ఆదివారమూ 'అన్నగారి సంత' పేరిట ఈ అమ్మకాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ సందడి నెలకొంటుంది. కొనుగోలుదారులతో యార్డు మొత్తం కిటకిటలాడుతుంటుంది. సంత లోపలికి వెళ్లాలంటే ప్రజలకు కాస్తంత ప్రయాస తప్పదు. అద్దంకికి దాదాపు 10 నుంచి 20 కి.మీ. పరిధిలోని వారంతా కూరగాయల కోసం ఇక్కడికి వస్తుంటారు. బహిరంగ మార్కెట్ తో పోలిస్తే చవకగా, తాజాగా కూరగాయలు లభిస్తుండటమే ఇందుకు కారణం. అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం నేత నాగినేని రామకృష్ణ మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఇది. మార్కెట్ యార్డులో ఒకరోజు సంత నిర్వహించి ప్రజలకు మేలు కలిగించాలని ఆయన వేసిన అడుగు విజయవంతమైంది. కూరగాయలు పండించే రైతులే ఈ సంతలో అమ్మకాలు చేపడతారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 40 దుకాణాలతో ప్రారంభమై, ఇప్పుడు 150 దుకాణాలకు పెరిగింది. రైతులు సైతం తమకు గిట్టుబాటు ధర లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా సంతలు రాష్ట్రమంతటా ఉంటే ఎంత బాగుంటుందో కదా?