: ఇలాంటి దారుణ పరిస్థితి ఎప్పుడూ చూళ్లేదు!: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది
1990 నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నప్పటికీ సభలో ఇలాంటి దారుణ పరిస్థితి ఇప్పటి వరకు చూడలేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది లోక్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎంపీల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, దేశం యావత్తు పార్లమెంటు వైపు ఆసక్తిగా చూస్తోందని అన్నారు. సభ్యుల ప్రవర్తన సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటే ప్రజలు హర్షించరని ఆయన తెలిపారు. లలిత్ గేట్ అంశంలో చర్చ జరగాలని మొదటి నుంచి తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. సభను అడ్డుకోవడం సరికాదని ఆయన ప్రతిపక్షానికి హితవు పలికారు.