: మానవతాదృష్టితో సాయం చేశానంటూ సుష్మా చెప్పటం సరికాదు: ఖర్గే వాదన
లలిత్ మోదీ విషయంలో మానవతాదృష్టితో సాయం చేశానన్న మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మానవతాదృక్పథంతో సాయం చేయాలనుకుంటే లలిత్ ను భారత్ రావాలని ఎందుకు చెప్పలేదు? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. లేఖలు, ఈమెయిల్స్ కాకుండా నోటిమాటతోనే సహకరించారని, ఈ వ్యవహారాన్నంతా లోతుగా పరిశీలించాలని చెప్పారు. చట్టం వేరు, మానవత్వం వేరన్న ఖర్గే, లలిత్ ఒక నేరస్థుడని, మానవత్వంతో సహకరించాలన్నా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేశారు. అతనికి ప్రయాణపత్రం ఇవ్వటంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఎలా ట్వీట్ చేశారు? అని సుష్మను సూటిగా అడిగారు. సహకరించేటప్పుడు కనీసం అధికారుల సలహా ఎందుకు తీసుకోలేదని గట్టిగా అడిగారు. మానవతాదృష్టితో సాయమంటూ సుష్మా చెప్పటం సరికాదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లలిత్ కు ప్రయాణపత్రాలు ఇస్తే భారత్-బ్రిటన్ సంబంధాల మధ్య ఎలాంటి ప్రభావం ఉండదని రాయబారికి చెప్పారన్నారు. లలిత్ కు సాయంచేసిన విషయంలో ఒక కారణానికి మరో కారణానికి సంబంధం లేకుండా 3 విభిన్న కారణాలు చెప్పారని పేర్కొన్నారు. మొదట పెళ్లి, తరువాత అధ్యక్షుడిని కలిసేందుకని, ఆ తరువాత వైద్యమని చెప్పారని వెల్లడించారు. అసలు లలిత్ కు సుష్మ కుటుంబసభ్యులే న్యాయవాదులన్న ఖర్గే, వారి కుటుంబ సభ్యుల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. కానీ తాను ఏ తప్పు చేయలేదంటూ సుష్మాస్వరాజ్ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మానవత్వంతో సాయం చేసినవారు లలిత్ ను భారత్ కు ఎందుకు రప్పించలేకపోతున్నారని నిలదీశారు. లలిత్ విదేశాల్లో రిసార్టుల్లో తిరిగేందుకు మీరు సాయం చేస్తారా? అని అడిగారు. ఈ వ్యవహారంలో తప్పు జరిగింది కాబట్టే ప్రధాని మాట్లాడటం లేదన్న ఖర్గే, నల్లధనాన్ని వెనక్కి తెస్తామంటూ ఆర్థిక నేరస్థుడికి ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. భారత్ లో తనకు ప్రమాదం ఉందని లలిత్ అంటున్నారని... మరి ఎన్డీఏ ఆ మాత్రం రక్షణ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో వసుంధరారాజే పాత్రపై కూడా నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారపక్షం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో లేని వసుంధరపై వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించింది.