: దర్శకుడిపై నమ్మకం ఉందన్న సల్మాన్... అది ముందే ఊహించానంటున్న సైఫ్
'భజరంగీ భాయ్ జాన్' సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ కొత్త సినిమా 'పాంథమ్'ను పాకిస్థాన్ లో నిషేధించాలంటూ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ న్యాయస్ధానానికెక్కాడు. దీనిపై సల్మాన్ స్పందించాడు. తన స్నేహితుడు చెడ్డ సినిమా తీయడని కబీర్ ఖాన్ కు సల్మాన్ బాసటగా నిలిచాడు. 'పాంథమ్' సినిమా ఇంకా విడుదల కాలేదు, ఎవరూ చూడలేదు. దీనిపై అప్పుడే కామెంట్ చేయడం సరికాదని అన్నాడు. కబీర్ ఖాన్ నిజాయతీ పరుడని, అతను చెడ్డ సినిమా తీయడని తన నమ్మకమని సల్మాన్ తెలిపాడు. దీనిపై మరో బాలీవుడ్ నటుడు, ఈ సినిమా హీరో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, తన సినిమాను పాకిస్థాన్ లో నిషేధించాలని కోరడం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని అన్నాడు. ఇలా జరగొచ్చని ముందే ఊహించానని పేర్కొన్న సైఫ్, గతంలో తన సినిమా ఏజెంట్ వినోద్ ను పాక్ లో నిషేధించారని గుర్తు చేశాడు. సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా ఎస్ హుస్సేన్ జైదీ నవల 'ముంబై పాంథర్స్' ఆధారంగా రూపొందింది. ఈ నెల 28న విడుదల కానుంది.