: ఆత్మాహుతి వల్ల ప్రత్యేకహోదా వస్తుందంటే...నేను చేసుకుంటా: సినీ నటుడు శివాజీ
ఆత్మాహుతి వల్ల ప్రత్యేకహోదా వస్తుందంటే ముందుగా ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీ నటుడు శివాజీ తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని శివాజీ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆత్మహత్యల వల్ల కుటుంబం క్షోభపడుతుందని ఆయన సూచించారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా గురించి విభజన బిల్లులో పెట్టలేదని రాజకీయనాయకులు చెప్పవద్దని ఆయన సూచించారు. ప్రత్యేకహోదా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మొదలు పెట్టిన రోజు తాను ఒక్కడినే అయినా ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు కలసి వస్తున్నారని ఆయన తెలిపారు. తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకం కాదని శివాజీ స్పష్టం చేశారు. ఆయన కలిసివస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుందనేది తన భావనని, ఆయనపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని ఆయన తెలిపారు.