: తెలంగాణ జైళ్లలో ఖైదీలను కలవాలంటే ఇకపై ఆధార్ చూపాలి
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ ఆధార్ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ క్రమంలో జైళ్లలో కూడా ఆధార్ అనుసంధానం చేపట్టబోతున్నారు. ఇక నుంచి జైళ్లలో ఖైదీలను కలవాలని వచ్చే కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని నిబంధన పెట్టబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలుసుకునేందుకు బంధువులు, కుటుంబసభ్యులకు జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తారు. ఈ సమయంలో వారు తమ గుర్తింపును అధికారులకు చూపించాల్సి ఉంటుందట. జైళ్లో ఉన్న వారితో వారికెలాంటి బంధుత్వం ఉందో తెలిపాల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ జైళ్లలో ప్రమాదకరమైన ఖైదీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఉగ్రవాద కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వారితో జైలు అధికారులు సమస్యలు ఎదుర్కుంటున్నారు. ములాఖత్ కు వచ్చినవారు అధికారులకు తెలియకుండా సెల్ ఫోన్ లు, మత్తు పదార్థాలు, నిషిద్ధ వస్తువులను రహస్యంగా ఖైదీలకు అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖైదీలను కలవడానికి వచ్చినవారి ఆధార్ డేటా బేస్ తో సరిచూడటం మంచిదని అధికారులు నిర్ణయానికి వచ్చారట. పూర్తి భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారి చెప్పారు.