: అసెంబ్లీ లాంజ్ లో మాజీ స్పీకర్ ల ఫోటోలు పెట్టడం సంప్రదాయం: చీఫ్ విప్ కాల్వ
ఏపీ అసెంబ్లీలో సాధారణ వ్యవహారాల కమిటీ ఈ రోజు భేటీ అయింది. పలు విషయాలతో పాటు వైఎస్ జగన్ ఇటీవల సీఎం, స్పీకర్ లకు రాసిన బహిరంగ లేఖపై కూడా చర్చించింది. అనంతరం టీడీపీ విప్ కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ, అసెంబ్లీ కమిటీల పరిధిలోకి రాని వాటిపై చర్చించేందుకే జనరల్ పర్పసెస్ కమిటీ అని చెప్పారు. నిబంధనల ప్రకారమే కమిటీలో పార్టీలకు చోటు ఉంటుందన్నారు. 'జగన్ కు అనుభవం లేదు, నిబంధనలు తెలియదన్న' కాల్వ, అధికారులను ప్రశ్నించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ లాంజ్ లో మాజీ స్పీకర్ల ఫోటోలు పెట్టడం సంప్రదాయమన్నారు. ఒకవేళ సీఎంల ఫోటోలు పెట్టాలనుకుంటే తెలుగు జాతి పేరును ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ ఫోటో సహా అందరి సీఎంల ఫోటోలు పెట్టాలని స్పీకర్ కు చెప్పామన్నారు. అయినా రాష్ట్రానికి వైఎస్ చేసిన మేలు ఏమీ లేదనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. వైఎస్ చిత్రపటంపై వైసీపీ రాద్దాంతం చేస్తోందని, స్పీకర్ కు లేఖ రాసి విమర్శలు చేయడం సరికాదని సూచించారు.