: ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న వెంకయ్య... ఇస్తామని ప్రచారం చేసిన మోదీ ఇప్పుడేమయ్యారు?: పల్లంరాజు
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన వెంకయ్యనాయుడు... అధికారంలోకి వస్తే, ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడేమయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు ప్రశ్నించారు. విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు... ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటించారని... అయితే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా, ఎన్నికల సమయంలో ఏపీలో ప్రచారానికి వచ్చినప్పుడు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేశారు. అప్పట్లో అంత సీన్ క్రియేట్ చేసిన వీరిద్దరూ ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్వహించిన బంద్ లో పల్లంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.