: భారత ఉపఖండం పేరు 'ఖురాసన్' అట, పలు దేశాల పేర్లు మార్చిన ఐఎస్ఐఎస్
మరో ఐదేళ్లలో ప్రపంచంలోని 40 శాతం ప్రాంతాన్ని ఆక్రమించాలని లక్ష్యంగా పెట్టుకుని 'మిషన్ 2020' పేరిట మ్యాప్ ను విడుదల చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, 'తమ రాజ్యం'లోని అన్ని దేశాల పేర్లనూ మార్చి వేసుకున్నారు. భారత ఉపఖండానికి 'ఖురాసన్' అని పేరు పెట్టుకున్న ఐఎస్ఐఎస్ స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ ప్రాంతాలను 'అండాలుస్'గా నామకరణం చేసింది. 8 నుంచి 16వ శతాబ్దం వరకూ ఇస్లాం పాలకులు రాజ్యమేలిన అన్ని ప్రాంతాలనూ స్వాధీనం చేసుకోవడమే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యమని బీబీసీ రిపోర్టర్ ఆండ్ర్యూ హోస్కెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీరి వద్ద 50 వేల మంది జీహాదీలు, 2 బిలియన్ పౌండ్ల (సుమారు రూ. 20 వేల కోట్లు) నగదు ఉందని ఆయన అన్నారు. కాగా, మొత్తం 60 దేశాలను తమ పాలన కిందకు తీసుకోవాలని భావిస్తున్న ఐఎస్ఐఎస్, వివిధ ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టుకుంది. అల్జీరియా, మొరాకో, సెనెగల్, ఐవరీ కోస్ట్, లైబీరియా ప్రాంతాలకు 'మగరేబ్' అని, కాంగో, టాంజానియా, ఉగాండా, కెన్యా ప్రాంతాలకు 'ది ల్యాండ్ ఆఫ్ హబాషా' అని, లిబియా, ఈజిప్ట్, సూడాన్, నైగర్ ప్రాంతాలకు 'ది ల్యాండ్ ఆఫ్ అల్కినానా' అని, టర్కీ, గ్రీస్, బల్గేరియా ప్రాంతాలకు 'అనతోల్'అని, ఉక్రెయిన్, బెలారస్, యుగోస్లావియా, హంగేరీ, ఆస్ట్రియా ప్రాంతాలకు 'ఒరోబ్పా' అని, తుర్కమెనిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రాంతాలకు 'కుర్దిస్థాన్' అని, కజకిస్థాన్ ప్రాంతానికి 'ఖూజ్' అని, సౌదీ అరేబియా, ఈస్ట్ అరేబియా, ఒమన్ ప్రాంతాలకు 'హిజా' అని పేర్లు పెట్టుకుంది. ఇరాక్ పేరును మాత్రం మార్చని ఐఎస్ఐఎస్, సిరియాకు 'షామ్' అని పేరు పెట్టుకుంది.