: పాఠశాలలకు సెలవులు... మూతపడ్డ పెట్రోల్ బంకులు... ఏపీలో సమ్మె సంపూర్ణం
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేస్తున్న బంద్ ఆ రాష్ట్రంలో సంపూర్ణంగా కొనసాగుతోంది. సీపీఐ బంద్ కు టీడీపీ, బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. నేటి ఉదయమే రోడ్లపైకి వచ్చిన ఆయా పార్టీల నేతలు అక్కడక్కడ రోడ్లపైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. పెట్రోల్ పంపుల యజమానులు కూడా బంద్ కు సంఘీభావం ప్రకటించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా నేటి ఉదయం నుంచి పెట్రోల్ బంకులు తెరచుకోలేదు. ఇక బంద్ కు మద్దతు పలికిన లారీ ఓనర్ల అసోసియేషన్ ఎక్కడి లారీలను అక్కడే నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వ్యాపారస్తులు కూడా బంద్ కు సంఘీభావంగా నేడు తమ కార్యకలాపాలకు విరామం ఇచ్చారు. దీంతో ఎక్కడా వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరచుకోలేదు. ఇదిలా ఉంటే, బంద్ కు మద్దతు ప్రకటించిన సినిమా థియేటర్ల యజమానులు నేటి మార్నింగ్ షోను నిలిపివేశారు. వెరసి ఏపీలో బంద్ సంపూర్ణంగానే కాక స్వచ్ఛందంగానూ జరుగుతోంది.