: సచిన్ పై పిటిషన్ ను కొట్టివేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ప్రదానం చేసిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దేశ అత్యున్నత పురస్కారానికున్న పేరుప్రఖ్యాతులను సచిన్ వాణిజ్య ఒప్పందాలు రాబట్టేందుకు ఉపయోగించాడని వీకే నస్వా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతరత్న అవార్డును సచిన్ చర్యలు కించపరుస్తున్నాయంటూ ఆవేదన వెలిబుచ్చారు. నైతికంగా బాధ్యత వహించి సచినే పురస్కారాన్ని ఇచ్చివేయాలని, లేకుంటే, సచిన్ కు ఇచ్చిన అవార్డును రద్దు చేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, విచారణ చేపట్టిన జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎస్కే గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ నస్వా దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని అభిప్రాయపడింది. ఈ విషయంలో వీకే నస్వా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చని పేర్కొంది. కాగా, నస్వా మరో విషయాన్ని కూడా ఎత్తిచూపారు. ఓ పుస్తకంలో 'భారతరత్న సచిన్ టెండూల్కర్' అని ఉందని, భారతరత్న ఓ టైటిల్ కాదని, దాన్ని పేర్లకు ముందు పేర్కొనరాదని అన్నారు. హైకోర్టు నిర్ణయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయమై కేంద్రాన్ని కలుస్తానని, అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు.