: ఈ డాక్టర్ దంపతులు రక్తపిశాచాలు!


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. నిరుపేద బాలల రక్తాన్ని జలగల్లా పీల్చేసిన డాక్టర్ దంపతుల నిర్వాకం వెలుగుచూసింది. లక్నోలోని కంచన్ మార్కెట్ లో డాక్టర్ వీకే కోహ్లీ, డాక్టర్ చిత్రా కోహ్లీ దంపతులు ఓ పాథలాజికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నారు. ఈ ల్యాబ్ లో 'కోహ్లీ బ్లడ్ బ్యాంక్ అండ్ కాంపొనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తున్నారు. వీరు నిర్వహించిన ల్యాబ్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సిటీ మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్ మిశ్రా, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ సమక్షంలో సీఐ సర్వేష్ కుమార్ మిశ్రా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వైద్య దంపతులు గత ఆరేళ్లుగా చేస్తున్న నిర్వాకం వెలుగు చూసింది. నిబంధనలన్నీ ఉల్లంఘించిన ఈ వైద్యులు అక్రమంగా ఎనిమిదేళ్లు కూడా నిండని వారి నుంచి రక్తం సేకరిస్తున్నారు. అలా సేకరించిన రక్తానికి బ్లడ్ గ్రూప్ తప్ప మరే విధమైన పరీక్షలు నిర్వహించకపోవడం విశేషం. ఇలా సుమారు పది వేల మంది బాలల నుంచి రక్తాన్ని సేకరించిన వీరు, కేవలం 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి, నాలుగు కోట్ల రూపాయిలు సంపాదించినట్టు గుర్తించారు. ఒక్కో మైనర్ నుంచి వరుసగా మూడు రోజులు రక్తం తీసుకున్న సందర్భాలు కూడా ఉండడం విశేషం. డబ్బులు ఎర చూపి రక్తం పిండుకునేందుకు ఈ దంపతులు బ్రోకర్లను కూడా నియమించుకున్నట్టు దాడుల్లో బట్టబయలైంది. బాధితులు నిరుపేద కుటుంబాలకు చెందినవారేనని గుర్తించారు. దీంతో వారిని ప్రశ్నించగా, కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు ఇలా రక్తాన్ని అమ్ముకున్నట్టు తెలిపారు. కాగా, ల్యాబ్ మేనేజర్ వీకే భట్నాగర్, ల్యాబ్ టెక్నీషియన్ శాంతారాంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అమెరికా పర్యటనలో ఉన్న డాక్టర్ దంపతులు రాగానే అరెస్టు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News