: భారత ఆటగాళ్లకు రవిశాస్త్రి ఘాటైన హెచ్చరిక!
శ్రీలంకలో ఉన్న భారత జట్టుతో కలిసిన టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి తనదైన శైలిలో ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. మ్యాచ్ ను డ్రా చేసుకునేందుకు అయితే గ్రౌండ్ కు రావొద్దని హెచ్చరించారు. గెలుపే లక్ష్యంగా బరిలో దిగాలని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు నేర్చుకునే పర్వం ముగిసిందని, నేర్చుకున్న దానిని కార్యాచరణలో చూపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. టెస్టులో 20 వికెట్లు కూల్చడంపై దృష్టి పెట్టాలని పరోక్షంగా బౌలింగ్ విభాగానికి సూచించారు. "మ్యాచ్ లు గెలవడం మొదలుపెట్టాలి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఆడి ఎంతో నేర్చుకున్నారు. బాగా తెలిసిన పరిస్థితుల నడుమ ఆడే సమయంలో ఆ అనుభవం ఎంతో అక్కరకు వస్తుంది" అని వివరించారు.