: తిరుపతిలో బంద్... ఆర్టీసీ డిపో ముందు మాజీ ఎంపీ చింతా మోహన్ బైఠాయింపు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తిరుపతికి చెందిన మునికోటి ఆత్మార్పణం చేసుకున్న నేపథ్యంలో సంతాపంగా కాంగ్రెస్ పార్టీ నేడు నగర బంద్ కు పిలుపునిచ్చింది. మొన్న తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసిన మునికోటి నిన్న చెన్నైలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో, నేడు తిరుపతి బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నేటి ఉదయమే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు నగరంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఏకంగా బస్ డిపో ముందు బైఠాయించారు. ఇదిలా ఉంటే, మునికోటి మృతికి సంతాపంగా నగరంలోని వ్యాపార సంస్థలు, విద్యాలయాలు స్వచ్ఛందంగానే మూతపడుతున్నాయి. కాగా, రేపు ఏపీ బంద్ కు కూడా పిలుపునిచ్చారు.