: చంద్రబాబు అంటే భయం... జగన్ ఉపయోగపడతాడనే ఆశ... మోడీ అంతరంగం ఇదే!: తేల్చి చెప్పిన సినీ నటుడు శివాజీ


ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకంటే, విభజనకు సహకరించి, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీనే సీమాంధ్రులకు ఎక్కువ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని బీరాలు పలికిన బీజేపీ పెద్దలు ఇప్పుడెందుకు నోర్మూసుకుని కూర్చున్నారని ప్రశ్నించారు. 2019లో వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడానికి జాతీయ రాజకీయాల్లో శక్తిమంతమైన చంద్రబాబు అండ ఉండక తప్పదనే భావనలో మోదీ ఉన్నారని... అందుకే చంద్రబాబును ఇప్పుడే తొక్కేయాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, జగన్ మద్దతు తీసుకునే పరిస్థితి కూడా రావచ్చనే రెండో ఆలోచన కూడా మోదీ మదిలో ఉందని చెప్పారు. ఈ రెండు కారణాలవల్లే ఏపీకి చెందిన ఇద్దరు నేతలను ఆయన ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మునూ సీమాంధ్రులు అడగడం లేదని... హామీ మేరకు ప్రత్యేక హోదా ఇస్తే చాలని మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన బీజేపీ నేతలకు అంత సీన్ లేదని... ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, ఒక్క సీటు గెలిపించుకోవడం కూడా బీజేపీ తరం కాదని జోస్యం చెప్పారు. ఆంధ్రుడైన వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలని... లేకపోతే ఏపీలో ఆయన తన అస్తిత్వం కోల్పోక తప్పదని అన్నారు.

  • Loading...

More Telugu News