: రూ. 90 వేల కోట్లకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భారం, ఇక అమరావతి నిర్మాణం మొదలైతే..!


నవ్యాంధ్ర రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, రుణ మాఫీ, సామాజిక పింఛన్లు తదితరాలు ప్రభుత్వ ఖజానాపై ఎనలేని భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మోస్తున్న ఆర్థిక భారం రూ. 90 వేల కోట్లకు చేరగా, రాజధాని అమరావతి నిర్మాణం మొదలైతే ప్రజలపై మరింతగా ఒత్తిడి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలను నిర్వహించేందుకు, పాత అప్పులను తీర్చేందుకు ఏపీ సర్కారు ముందున్న ఏకైక మార్గం కొత్త అప్పులను చేయడమే. ఇందుకోసం కొత్త రుణ మార్గాలను బాబు సర్కారు మధిస్తోంది. రాష్ట్ర విభజన తరవాత నెలకొన్న పరిస్థితులే తీవ్ర ఆర్థిక భారాన్ని మోపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఖర్చులకు సరిపడా నిధులందక ఇబ్బందులు పడుతున్న సర్కారు, బహిరంగ మార్కెట్ నుంచి రుణాలను స్వీకరించక తప్పడం లేదు. విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రానికి రూ. 1.15 లక్షల కోట్ల అప్పులుండగా, జనాభా ప్రాతిపదికన నవ్యాంధ్రకు రూ. 67,441 కోట్ల అప్పు బదిలీ అయిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం రూ. 11 వేల కోట్లను అప్పుగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేసేయగా, రుణ భారం రూ. 78,441 కోట్లకు పెరిగింది. గత పదేళ్లుగా చేసిన అప్పులపై వడ్డీలు కట్టేందుకు 2015-16లో రూ. 16 వేల కోట్లకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ సంవత్సరం రూ. 18 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో రూ. 6 వేల కోట్ల అప్పులు చేసింది. దీంతో మొత్తం రుణభారం రూ. 84 వేల కోట్లను దాటగా, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న విదేశీ ఆర్థిక సాయం కింద చేసిన చివరి అప్పు రూ. 12 వేల కోట్లను జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉంది. ఈ అప్పును ప్రాజెక్టుల వారీగా విభజించనుండటంతో, ఏపీ వాటా కింద రూ. 6 వేల కోట్ల వరకూ భారం పడవచ్చని తెలుస్తోంది. మొత్తం అప్పులన్నీ కలిపితే రూ. 90 వేల కోట్లను దాటతాయి. వస్తున్న ఆదాయం ఖర్చులకే అంతంతమాత్రంగా సరిపోతున్న తరుణంలో వీటిపై వడ్డీలు చెల్లించేందుకు మరిన్ని ఆదాయ మార్గాల అన్వేషణలో రాష్ట్రం తలమునకలై ఉంది. ఇంకా విద్యార్థులకు బోధనా రుసుముల చెల్లింపు మొదలు కాలేదు. ఈ భారానికి తోడు అమరావతి నిర్మాణం ప్రారంభమైతే, ప్రజలపై భారం మరింతగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News