: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే... అయినా రుణాలివ్వని బ్యాంకులు!
మాయా నేగి (43). తన కుమార్తె నికిత ఉన్నత విద్యకు అవసరమైన రుణం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు. అక్కడ తన భర్త కేంద్ర ప్రభుత్వ అధీనంలోని హెచ్ఎంటీలో పనిచేస్తుంటాడని చెప్పగానే, రుణ దరఖాస్తును బ్యాంకు అధికారులు తిరస్కరించారు. ఎస్బీఐ మాత్రమే కాదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, నైనిటాల్ బ్యాంకు సైతం రుణమివ్వలేమని చేతులెత్తేశాయి. ఈ పరిస్థితి ఒక్క మాయా నేగికే కాదు. హెచ్ ఎంటీ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మందికీ ఎదురవుతోంది. హెచ్ఎంటీ వాచెస్ సంస్థలో పనిచేస్తున్న మాయా భర్తకు గత 16 నెలలుగా వేతనాలు అందలేదు. అతి త్వరలో ఆ సంస్థ మూత పడుతుందన్న వార్తలు వస్తుండటమే ఇందుకు కారణం. హెచ్ఎంటీ వాచెస్ మాత్రమే కాదు. హెచ్ఎంటీ మెషీన్ టూల్స్, హెచ్ఎంటీ ఇంటర్నేషనల్, హెచ్ఎంటీ హోల్డింగ్ లలోనూ పరిస్థితి ఇదే. ఈ సంస్థలన్నీ కలిపి ఒకే కంపెనీని నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. భారీ సంఖ్యలో ఉద్యోగులను వీఆర్ఎస్ పేరిట ఇంటికి పంపాలని నిర్ణయించింది. కేవలం వీఆర్ఎస్ ద్వారా వచ్చే డబ్బుతో తమ జీవనం ఎలా గడుస్తుందని సంస్థ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 16 నెలలుగా జీతాలు రాని మరే కేంద్ర ప్రభుత్వ సంస్థా ఇండియాలో లేదని హెచ్ఎంటీ ఉద్యోగి జగత్ సింగ్ చమ్యాల్ సతీమణి గీత వాపోయారు. తాను ప్రతి రాత్రీ కష్టాల గురించి, భవిష్యత్ గురించి చర్చించుకుంటూనే ఉంటున్నామని వాపోయారు. తమ పిల్లల చదువులు సైతం మధ్యలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె వివరించారు. కేంద్రం తమను ఆదుకోవాలని హెచ్ఎంటీ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు.