: ఇండియాకు రూ. 88 వేల కోట్ల లాభం... మరోసారి తగ్గనున్న పెట్రోలు ధర!
ఇండియా కొనుగోలు చేస్తున్న ముడిచమురు బ్యారల్ ధర ఆరు నెలల కనిష్ఠ స్థాయిలో 49.11 డాలర్లకు దిగివచ్చింది. దీంతో మరోసారి పెట్రోలు ధరలను తగ్గిస్తూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే వారంలో జరిగే సమావేశంలో మరో రెండు నుంచి మూడు రూపాయల వరకూ ధరలు తగ్గవచ్చని సమాచారం. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరల పతనం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88,800 కోట్లను చమురు కంపెనీలు ఆదా చేసుకోనున్నాయి. డాలర్ బలంగా ఉండటం, చైనాలో ఆర్థిక కష్టాలు, ముడి చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఇరాన్ తదితర ఒపెక్ దేశాలు ససేమిరా అంటుండటంతో ధరలు దిగివస్తున్నాయి. కాగా, ఒమన్, దుబాయ్ నుంచి ఇండియా కొనుగోలు చేసే స్వీట్ బ్రెంట్ క్రూడాయిల్ బాస్కెట్ ధర జనవరి 30 తరువాత తొలిసారిగా 46.28 డాలర్లకు తగ్గింది. మొత్తం మీద ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 6 మధ్య ఇండియా కొన్న క్రూడాయిల్ సరాసరి ధర బ్యారల్ కు 58 డాలర్లుగా ఉండగా, సమీప భవిష్యత్తులో ఇది మరింతగా తగ్గనుంది. 58 డాలర్ల సరాసరి ఈ ఏడాదంతా కొనసాగితే, రూ. 78 వేల కోట్ల దిగుమతి బిల్లులను మిగుల్చుకోవచ్చని రీసెర్చ్ అండ్ రేటింగ్ ఏజన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె రవిచంద్రన్ వ్యాఖ్యానించారు. క్రూడాయిల్ ధర 1 డాలరు తగ్గితే, భారత ఇంపోర్ట్ బిల్ లో రూ. 6,500 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై రూ. 900 కోట్లు ఆదా అవుతుంది. అయితే, రూపాయి మారకపు విలువ మార్పుపై ఆధారపడి ఈ లబ్ధి పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ ఒక్క రూపాయి పెరిగితే, దిగుమతి బిల్లుపై రూ. 7,455 కోట్ల భారం పడుతుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వెల్లడించింది. ఇదిలావుండగా, మరో రెండేళ్ల పాటు క్రూడాయిల్ ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని ఐఓసీ చైర్మన్ బీ అశోక్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గడం, డీజల్ పై నియంత్రణ తొలగించడం, ఎల్పీజీ కనెక్షన్లపై సబ్సిడీని వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరగడం తదితర కారణాలతో 2013-14లో రూ. 1.39 లక్షల కోట్లున్న రికవరీ భారం 2014-15లో రూ. 72,314 కోట్లకు తగ్గిందని, ఈ సంవత్సరం రికవరీ భారం మరింతగా దిగివస్తుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు.