: శ్రావణం వస్తే పెరుగుతుందట, ఇప్పుడే బంగారం కొనేస్తున్నారు!
గడచిన వారం పదిరోజుల వ్యవధిలో బంగారం విక్రయాలు 20 నుంచి 30 శాతం వరకూ పెరిగాయి. బంగారం ధరలు 25 వేల రూపాయల దిగువకు రావడం, శ్రావణమాసం వస్తే మళ్లీ ధరలు పెరుగుతాయన్న భయం ప్రజలను ఆభరణాల దుకాణాలవైపు నడిపిస్తుండగా, హైదరాబాదులో అమ్మకాలు 20 శాతానికి పైగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 24,950 దరిదాపుల్లో కొనసాగుతోందని, ఆభరణాల బంగారం ధర ఇంకాస్త తక్కువగా ఉండటంతో అమ్మకాలు పెరిగాయని, ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ వివరించారు. ఇప్పటికిప్పుడు ధరలు మరింతగా తగ్గే అవకాశం లేదని తెలిపారు. ఇదే సమయంలో కొన్ని రేటింగ్ సంస్థలు బంగారం ధర రూ. 20,500 వరకూ దిగజారవచ్చని నివేదికలు వెలువరించగా, బులియన్ వర్గాలు మాత్రం దాన్ని కొట్టి పారేస్తున్నాయి. పండగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ఆభరణాల తయారీదారులు త్వరలో నూతన కొనుగోళ్లకు దిగే అవకాశాలున్నాయని, మరో మూడు వారాల్లో బంగారం ధర రూ. 26 వేలకు పెరుగుతుందని విజయ్ కుమార్ అంచనా వేశారు. మరోవైపు వెండి ధర సైతం గణనీయంగా తగ్గడంతో, వెండి వస్తువుల అమ్మకాలు 40 శాతం వరకూ పెరిగాయని తెలుస్తోంది. అయితే, ఈ ధరలు మరింతగా తగ్గుతాయని వేచిచూస్తున్నవారి సంఖ్యా అధికంగానే ఉంది.