: 'బుల్లెట్ షెల్స్ పుతిన్'... ఉక్రెయిన్ యువతి అద్భుత కళాసృష్టి
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ప్రస్తుతం ఎంతటి సంక్షుభిత వాతావరణం నెలకొని ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే, ఉక్రెయిన్ కు చెందిన దరియా మర్చెంకో (33) అనే మహిళా ఆర్టిస్టు బుల్లెట్ షెల్స్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిత్రాన్ని రూపొందించింది. 5,000 బుల్లెట్ షెల్స్ ను అత్యంత పొందికగా పేర్చడం ద్వారా ఆమె పుతిన్ ముఖాకృతిని పోర్ట్రెయిట్ రూపంలో ఆవిష్కరించడం విశేషం. ఆ చిత్రానికి ఆమె 'ద ఫేస్ ఆఫ్ వార్' అని నామకరణం చేసింది. కాగా, 'సీరియస్ చూపులతో ఆ చిత్రపటంలో ఒదిగిపోయిన పుతిన్'తో ఒకే రూములో గడపడం తొలుత భయంగా అనిపించినా, తర్వాత మామూలైపోయిందని తెలిపింది. అమ్మడు ఆ ఖాళీ బుల్లెట్లను వేర్పాటువాద ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుంచి సేకరించిందట. ఆమె రూపొందించిన ఈ విలక్షణ పుతిన్ చిత్రానికి అంతర్జాతీయ మీడియా గుర్తింపు దక్కింది. బ్రిటన్ లోని అగ్రశ్రేణి పత్రికలు, ఇతర యూరప్ దేశాల్లోని ప్రముఖ పత్రికలు, చానళ్లు ఈ విషయాన్ని ప్రముఖంగా కవర్ చేశాయి.