: మీ అడుగులూ కేసీఆర్ బాటలోనేనా?: ఓయూ విద్యార్థులకు రాహుల్ చురక!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న తనను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ఉస్మానియా విద్యార్థులకు చురకలంటించారు. మీ అడుగులు కూడా కేసీఆర్ బాటలోనే పడుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో విద్యార్థుల నోట మాట రాలేదు. అసలు విషయమేంటంటే, కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. దీనిపై విపక్ష స్థానాల్లోని కాంగ్రెస్, టీడీపీలు కేసీఆర్ పై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ కూడా కేసీఆర్ పై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఓయూ విద్యార్థి బృందంలో 55 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఒక్కరంటే ఒక్క యువతి మాత్రమే ఉందట. అంతమంది విద్యార్థుల్లో ఒక్క యువతే ఉండటం చూసిన రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారట. ‘‘కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళా లేదు, 55 మంది ప్రతినిధుల బృందంలో ఒక్కరే యువతి ఉంది. మీరు కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారా? ఇదేం పద్ధతి? ఈసారి నా వద్దకు వచ్చేటప్పుడు మీ బృందంలో నాలుగో వంతు యువతులుండాల్సిందే. మహిళల సంఖ్య పెరిగినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది’’ అని రాహుల్ విద్యార్థులకు క్లాసు పీకారట.