: ఊర్లోని మంచినే కాదు చెడునూ దత్తత తీసుకుంటాడు!: మహేష్ 'శ్రీమంతుడు' రివ్యూ
మహేశ్ బాబు సినిమా అంటే ఓ ప్రభంజనంలా ఉండాలని ఫ్యాన్స్ ఆశించడంలో తప్పులేదు. ప్రిన్స్ స్టామినా అలాంటిది. తాజాగా విడుదలైన శ్రీమంతుడు చిత్రం మహేశ్ కెరీర్లో ఓ విలక్షణమైనదిగా నిలిచిపోతుంది. సామాజిక ఇతివృత్తంతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఊరును దత్తత తీసుకోవడం, దాని అభివృద్ధికై పాటుపడడం వంటి సమకాలీన అంశాన్ని ఈ సినిమాలో హృద్యంగా చెప్పారు. ఈ చిత్రం సందేశాత్మకంగానే కనిపిస్తుంది. కానీ, ఊర్లోని మంచినే కాదు చెడునూ దత్తత తీసుకున్నానని హీరోతో చెప్పించడం కథలోని నవ్యతకు అద్దం పడుతుంది. ఆ పాయింట్ కు కమర్షియల్ కోటింగ్ ఇవ్వడంలో దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యాడు. కథ విషయానికొస్తే... రవికాంత్ (జగపతిబాబు) ఓ బిజినెస్ టైకూన్. అతని తనయుడే హర్షవర్ధన్ (మహేశ్ బాబు). ఏ తండ్రయినా చేతికందిన కొడుకు బాధ్యతలు తీసుకుంటే బాగుండునని కోరుకోవడం సహజం. రవికాంత్ కూడా అలాగే ఆశిస్తాడు. కానీ, హర్ష ఆలోచనలు మరోలా ఉంటాయి. సకల వైభోగాలు అందుబాటులో ఉన్నా, జీవితంలో ఇంకేదో కావాలని అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలోనే చారుశీల (శృతి హాసన్) పరిచయమవుతుంది. సాధారణంగా హీరోహీరోయిన్ల మధ్య పరిచయం ప్రేమ కోసమే కదా, ఇక్కడా అంతే! అయితే, హర్ష చేసిన ప్రపోజ్ ను చారుశీల రిజెక్ట్ చేస్తుంది. అక్కడే కథ మలుపు తీసుకుంటుంది. హర్ష... రవికాంత్ కొడుకు అని తెలుసుకున్న చారుశీల "సొంత ఊరు కూడా తెలియదు" అన్న కోణంలో మాట్లాడుతుంది. ఆమె ద్వారానే హర్షకు తన స్వగ్రామం దేవరకోట అని తెలుస్తుంది. ఆపై హర్ష ఆ ఊరు వెళ్లడం, అక్కడ చారుశీల తండ్రి నారాయణరావు (రాజేంద్రప్రసాద్) ఇంట్లో ఆశ్రయం పొందడం... ఊరి బాగుకోసం శ్రమించడం, వెంకటరత్నం (ముఖేశ్ రిషి), శశి (సంపత్ రాజ్), రాధా (హరీశ్ ఉత్తమన్) వంటి ప్రతికూల శక్తులను ఎదుర్కోవడం మిగతా కథ. ఈ సమయంలోనే తన తండ్రి గతంలో ఆ ఊరి వాళ్లతో ఎదుర్కొన్న సమస్య ఏంటన్నది తెలుసుకుంటాడు. అటుపై ఏం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నటన పరంగా ఈ సినిమాలో అందరికీ ఫుల్ మార్కులు పడతాయి. ఓ రిచ్ మేన్ కు తనయుడిగా, సామాజిక బాధ్యతను తలకెత్తుకున్న వ్యక్తిగా మహేశ్ బాబు పాత్రను పండించాడు. అదే సమయంలో కుటుంబ విలువల కోసం తపించే యువకుడిగా కనిపిస్తాడు. చారుశీల పాత్రలో శృతి హాసన్ అందంగా ఒదిగిపోయింది. అందచందాల ప్రదర్శనకు, నటనకు అవకాశం ఉన్న పాత్ర అది. రవికాంత్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అనిపించేలా జగపతిబాబు నటన ఉంటుంది. భావోద్వేగాలు ప్రదర్శించే సన్నివేశాల్లో తన సత్తా ఏంటో చూపాడు. ఊరిపెద్దగా రాజేంద్రప్రసాద్, ప్రతినాయకులుగా ముఖేశ్ రిషి, సంపత్ రాజ్, హరీశ్ ఉత్తమన్ పరిధిమేరకు నటించి సినిమాను రక్తికట్టించారు. సీరియస్ గా నడిచే సినిమాకు అలీ, వెన్నెల కిశోర్ కామిక్ టచ్ ఇచ్చారు. టెక్నీషియన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ మధీ గురించే. సినిమా పేరుకు తగ్గట్టే ప్రతి ఫ్రేములోనూ రిచ్ నెస్ ఉట్టిపడేలా వర్క్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఆడియో సూపర్ హిట్టయిన నేపథ్యంలో, పాటలు తెరపై మరింత రంజుగా కనిపించాయి. ఇక, డైరక్టర్ కొరటాల శివ తనలోని రచయితను పూర్తిస్థాయిలో బయటికి తీసి ఈ సినిమాను విలక్షణరీతిలో ఆవిష్కరించాడు. కాన్సెప్ట్ కొత్తది కావడం సినిమాను విభిన్నంగా నిలుపుతుంది. కొత్త కథకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే జోడించి వెండితెరపై యమరంజుగా ఆవిష్కరించాడు. అయితే, సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువనిపించినా, కొన్ని చోట్ల కథనం నెమ్మదించినా, కథలో పట్టు ఉండడంతో ఓవరాల్ గా ప్రేక్షకుడు సంతృప్తి వ్యక్తం చేస్తాడు. రొటీన్ పంచ్ డైలాగులకు భిన్నంగా, డెప్త్ ఉన్న సంభాషణలతో రక్తికట్టించాడు శివ. మొత్తమ్మీద బాక్సాఫీసు కలెక్షన్ల విషయంలోనూ శ్రీమంతుడు వెరీ రిచ్ అని చాటగలిగే ఎలిమెంట్లు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు.