: భారతీ ఎయిర్ టెల్ వర్సెస్ రిలయన్స్ జియో... ఎవరు గెలుస్తారో?


దేశవ్యాప్తంగా 296 నగరాలు, పట్టణాల్లో సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్ టెల్ 4జి సేవలను గ్రాండ్ గా ప్రారంభించింది. ఆరంభదశలో కేవలం రూ. 25కే 4జి ప్యాకేజీలు అందిస్తామని ప్రకటించింది. 4జి స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా శాంసంగ్ తో డీల్ ను కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో 4జి లైసెన్స్ లను దేశవ్యాప్తంగా పొందిన మరో సంస్థ రిలయన్స్ జియో ఇంకా పైలెట్ ప్రాజెక్టుల దశలోనే ఉంది. ఈ రెండు సంస్థల్లో 4జి విస్తరణలో ఏ సంస్థ ముందడుగు వేస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఎయిర్ టెల్ ఇప్పటికే 296 నగరాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 18 వేల నగరాలు, పట్టణాల్లో సేవలను ప్రారంభిస్తామని, 80 శాతం పట్టణాలను కవర్ చేస్తామని చెబుతోంది. శాంసంగ్ తో పాటు జియోమీ, మోటరోలా, లెనోవో, ఆసుస్, హువావే తదితర కంపెనీల హ్యాండ్ సెట్లు 4జి తరంగాలకు మద్దతిచ్చేలా మార్కెట్లోకి వెల్లువెత్తనున్నాయి. ఈ కంపెనీలన్నీ ఎయిర్ టెల్ తో కలసి భారీ ఆఫర్లు ఇవ్వనున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో ఏకంగా 26 స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్న కంపెనీలతో కనీస ధర రూ. 4 వేల నుంచి 4జి ఫోన్లను అందిస్తామని ప్రకటించింది. ఎయిర్ టెల్ నెలకు రూ. 900కు అన్ లిమిటెడ్ కాల్స్, డేటా సదుపాయం కల్పిస్తామని వెల్లడించగా, రిలయన్స్ జియో రూ. 400 నుంచి రూ. 600 మధ్య ఈ సేవలను కస్టమర్ల దరికి చేరుస్తామని చెబుతోంది. ఎయిర్ టెల్ ప్రత్యేకించి 4జి యాప్ లను తయారు చేసి విడుదల చేయడంలో విఫలం కాగా, రిలయన్స్ మాత్రం జియో మనీ (ఆన్ లైన్ చెల్లింపుల కోసం), జియో చాట్ (వాయిస్, వర్డ్, వీడియో చాటింగ్ కోసం), జియో బీట్స్ (మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం) తయారు చేసింది. ఇక ఈ రెండు సంస్థల్లో ఏది కస్టమర్ల మది దోచుకుని ఆదాయాన్ని పెంచుకుంటుందన్న విషయం తెలియాలంటే, మరో ఏడాదికిపైగా ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News