: అన్ని ప్రశ్నలకూ జవాబులిస్తా... చర్చ జరిగితేనే!: సుష్మా స్వరాజ్ మెలిక
విపక్షాలు చేస్తున్న అన్ని ఆరోపణలకూ తన వద్ద సమాధానాలున్నాయని, పార్లమెంటు వేదికగా ఏ క్షణమైనా చర్చకు సిద్ధమని విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. అయితే, చర్చించేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, చర్చ జరిగే వాతావరణం కనిపించడం లేదని, చర్చిస్తే సమాధానాలు చెబుతానని మెలిక పెట్టారు. తాను లలిత్ మోదీకి ఎటువంటి సిఫార్సులూ చేయలేదని అన్నారు. వారి వద్ద ఒక్క ఆధారం కూడా లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. "నేనేమైనా లలిత్ మోదీని దేశం దాటించానా? ఆయన కోసం పదవిని వాడుకున్నానా? ఆయనకు కీలక పదవులు వచ్చేందుకు సహకరించానా? ఐపీఎల్ విషయంలో నా పాత్ర ఎందులోనైనా ఉందా?" అని ప్రశ్నించారు. ఆయన భార్య తనకు చాలా సంవత్సరాలుగా తెలుసునని, ఎన్నో మార్లు కలిశామని, ఆమె రెండు కిడ్నీలూ పాడైపోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే, భర్తతో సహా రావాల్సి ఉంటుందని బ్రిటన్ డాక్టర్ల సలహా మేరకు, తాను ప్రయాణ ఏర్పాట్ల కోసం సిఫార్సు చేసినట్టు తెలిపారు. కళ్లముందు ఎవరైనా చనిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. కాగా, సుష్మా ప్రసంగంపై కాంగ్రెస్ సైతం అంతే స్థాయిలో స్పందించింది. తమ ఆరోపణలకు పార్లమెంటు బయట కూడా సమాధానం చెప్పవచ్చని, అసలు ఇంతకాలం ఆమె మౌనంగా ఎందుకుందని ప్రశ్నించింది. నరేంద్ర మోదీ తన కింద ఉన్న అవినీతి మంత్రులను వెనకేసుకొస్తున్నారని ఆరోపించింది.