: అమేజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఫ్లిప్ కార్ట్: 'ట్విట్టర్' యుద్ధం!


ఇండియాలోని ప్రధాన ఈ-కామర్స్ సేవల సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ ల మధ్య ఆధిపత్య పోరు మరో అడుగు ముందుకేసింది. ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులు తమ ఆర్డర్లను అమేజాన్ మాధ్యమంగా పెడుతున్నారని చెబుతూ, ఓ ఫ్లిప్ కార్ట్ కార్యాలయం రిసెప్షన్ లో అమేజాన్ కార్టన్ నిలిపివున్న చిత్రాన్ని 'రెడ్డిట్' తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగానే, ఫ్లిప్ కార్ట్ తనదైన శైలిలో స్పందించింది. "మేము ఆ బాక్స్ ను రిసెప్షన్ డస్ట్ బిన్ గా వాడుతున్నాం" అని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ఈ చిత్రంలో 'అమేజాన్ డాట్ ఇన్' అని స్పష్టంగా రాసివున్న కార్టన్ రిసెప్షన్ పక్కనే ఉండగా, ఒకవేళ దాన్ని డస్ట్ బిన్ గా వాడుతున్నప్పటికీ, అది అక్కడికి ఎలా వచ్చిందని, ఎవరూ ఆర్డర్ ఇవ్వకుండా అంత పెద్ద డబ్బా ఎలా చేరిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, 2007లో అమేజాన్ నుంచి రాజీనామా చేసిన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లు బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్ ను ప్రారంభించి, అతిపెద్ద భారత ఈ-కామర్స్ సంస్థగా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సచిన్, స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ (వీరిద్దరూ బంధువులు కాదు, ఏ సంబంధమూ లేదు) ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇండియాలో ఈ-కామర్స్ రంగంలో పనిచేసేందుకు నాణ్యతతో కూడిన ఉద్యోగులు దొరకడం లేదని రోహిత్ ట్వీట్ చేస్తే, ఇండియాను కించపరిచే మాటలు వద్దని, ఎంతో మంది గొప్ప ఇంజనీర్లను ఇండియా ఇచ్చిందని సచిన్ ట్వీట్ చేశాడు. భారత ఈ-కామర్స్ రంగంలో ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ 44 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, స్నాప్ డీల్ 22 శాతం, అమేజాన్ 14 శాతం వాటాను కలిగివున్నాయి. 2020 నాటికి 32 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 85 వేల కోట్లు) చేరుతుందన్న అంచనాలున్న ఈ రంగంలో రారాజుగా ఎవరుంటారన్నది తేలేందుకు మరి కొన్నేళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్ అధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, అమేజాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ శరవేగంగా విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తూ దూసుకొస్తోంది.

  • Loading...

More Telugu News