: బీజేపీలో గుబులు పుట్టిస్తున్న 'కెప్టెన్' విజయకాంత్


తమిళనాట సంచలన రాజకీయాలకు మారుపేరుగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ మరోసారి తన శైలిని చాటుకున్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ కూటమిలో లేనని ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చారు. 2011 ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలో రెండవ అతి పెద్ద పార్టీగా డీఎండీకే అవతరించింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని అభిప్రాయ భేదాల నేపథ్యంలో అమ్మపై విజయకాంత్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు షరతులపై షరతులు విధిస్తూ బీజేపీ సహనాన్ని పరీక్షించారు. అనంతరం ఎట్టకేలకు కమలనాథుల కూటమిలో చేరిపోయారు. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ బీజేపీతో అంటీముట్టనట్టే విజయకాంత్ ప్రవర్తిస్తున్నారు. మరోవిషయం ఏమిటంటే, ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో విజయకాంత్ భేటీ అయ్యారు కూడా. ఈ క్రమంలో, నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్య నిషేధం విధించే పార్టీతోనే తాము పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అంతేకాదు, ప్రస్తుతం తాము ఏ కూటమిలో లేము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీలో గుబులు రేపుతున్నాయి. రేపు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో కంగారు పుట్టిస్తున్నాయి.

  • Loading...

More Telugu News