: పేరు వింటేనే నోరూరించే శ్రీవారి లడ్డూకు 300 ఏళ్లు!


"నేను తిరుపతి వెళ్లొచ్చాను" అని ఎవరైనా చెప్పగానే, అతని వైపు ఆశగా చూస్తాం. తిరుమల నుంచి శ్రీవెంకటేశ్వరుని ప్రసాదం తెచ్చి ఉంటాడు, కొంచమైనా పెట్టక పోతాడా అని. అదే శ్రీవారి లడ్డూ ప్రసాదం మహిమ! పేరు వింటేనే నోరూరించే ఈ లడ్డూ తయారీ మొదలై 300 సంవత్సరాలు పూర్తయింది. దేవదేవుడికి లడ్డూలను నివేదించడం ఆగస్టు 2, 1715 నుంచి ప్రారంభమైనట్టు ఆధారాలున్నాయి. ప్రపంచంలో మరే హిందూ దేవాలయం ప్రసాదమూ తిరుమల లడ్డూకు సాటిరాదంటే ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష తదితర ఎన్నో పదార్థాలను నియమిత పరిమాణం మేరకు కలిపి లడ్డూలను తయారు చేస్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతిఒక్కరూ ఈ లడ్డూలను ప్రసాదంగా స్వీకరిస్తారు. భక్తులు దర్శనానికి వెళ్లే విధానాన్ని బట్టి 300 గ్రాముల బరువున్న లడ్డూలను రూ. 10 నుంచి రూ. 25 ధరపై విక్రయిస్తారు. టీటీడీ లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 2014-15లో ప్రసాదాల విక్రయం వల్ల టీటీడీకి రూ. 2,401 కోట్ల ఆదాయం లభించింది. లడ్డూ తయారీ కేంద్రంలో 270 మంది వంటవారు సహా మొత్తం 620 మంది పని చేస్తుంటారు. ఇక్కడ రోజుకు 8 లక్షల వరకూ లడ్డూలు తయారవుతుంటాయి. లడ్డూతో పాటు శ్రీవారి కోసం పలు రకాల నైవేద్యాలను తయారు చేస్తుంటారు. వీటిల్లో వడలు, దోశలు, పులిహోర, పరమాన్నం, దద్దోజనం, జిలేబీ వంటి ఎన్నో రకాలుంటాయి. అయితే, లడ్డూలు మినహా మరే ప్రసాదాలూ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండకపోవడం కొంత నిరాశపరిచే అంశం.

  • Loading...

More Telugu News