: పురాణాలను ప్రస్తావించిన వెంకయ్య... విపక్షాలకు సర్పయాగాన్ని గుర్తు చేసిన కేంద్ర మంత్రి
పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న 25 మంది కాంగ్రెస్ ఎంపీలకు మద్దతుగా నిలిచే విపక్షాలకు ఎలాంటి గతి పడుతుందన్న విషయాన్ని తేటతెల్లం చేసేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన హిందూ పురాణాలను ప్రస్తావించారు. సర్పయాగాన్ని గుర్తు చేశారు. సర్పయాగంలో ఇంద్రుడికి పట్టిన గతిని కొని తెచ్చుకోవద్దంటూ ఆయన విపక్ష సభ్యులను హెచ్చరించారు. ‘‘పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు... తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిని హతమార్చేందుకు సర్పయాగం చేశాడు. దీన్నుంచి తప్పించుకోవడానికి తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనమేజయుడు ఇంద్రునితో సహా వచ్చి యాగాగ్నిలో పడాలని ఆదేశించాడు. ఇంద్రుడు తనకు వాటిల్లిన ముప్పును గ్రహించి తక్షకుడిని వదిలించుకుంటాడు. అప్పుడు తక్షకుడు వచ్చి యాగాగ్నిలో పడిపోతాడు’’ అని వెంకయ్య గుక్క తిప్పుకోకుండా పురాణాన్ని వినిపించారు. ప్రస్తుతం సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ సభ్యులకు మద్దతునిస్తున్న విపక్షాలకు కూడా ఇంద్రుడికి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.