: కొట్టాడు, తిట్టాడు, బెదిరించాడు... చివరికి 'బాబ్బాబు! వదిలిపెట్టండ్రా పాకిస్థాన్ పారిపోతా'నన్నాడు!


జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడి గ్రామస్థులను బందీలుగా తీసుకెళ్లిన ఉగ్రవాది ఎలా పట్టుబడ్డాడనుకుంటున్నారు?... గ్రామస్థుల ధైర్యసాహసాల కారణంగా పట్టుబడ్డాడు. ఆయుధాలు కలిగి ఉన్న ఉస్మాన్ సహచరుడు మన సైనికుల తూటాకు కుప్పకూలడంతో తాను తిరిగి పాకిస్థాన్ చేరాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరుపుతూ గ్రామంలో చొరబడ్డాడు. అక్కడ ముగ్గురు గ్రామస్థులను బందీలుగా చేసుకున్నాడు. వారిని నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లాడు. పాకిస్థాన్ వెళ్లిపోయేందుకు దారి చూపాలని, లేని పక్షంలో చంపేస్తానని వారిని బెదిరించాడు. పాకిస్థాన్ కు ఎలా వెళ్లాలో తమకు తెలియదని వారు చెప్పడంతో వారిని తుపాకీతో కొట్టాడు. బండ బూతులు తిట్టాడు. అయితే బందీలలోని రాకేష్ కుమార్ సింగ్, విక్రమ్ జీత్ సింగ్ వరుసకు బావ, బావమరిది అవుతారు. పైగా స్నేహితులు కూడా కావడంతో వీరిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. దీంతో వారిద్దరూ ముష్కరుడ్ని ఎలాగైనా దేశం దాటనీయకూడదని భావించారు. ఇంతలో దగ్గర్లో పోలీసుల కాల్పులు వినిపించాయి. అంతే, వీరిద్దరూ చురుగ్గా కదిలారు. ఒకడు తుపాకీ పట్టుకుంటే, మరొకడు వాడ్ని పట్టుకున్నాడు. ఉస్మాన్ పెనుగులాడుతుండడంతో బందీల్లో ఒకడైన ఇమ్రాన్ చురుగ్గా స్పందించాడు. వీరు ముగ్గురూ కలిసి ఉస్మాన్ ను కదలకుండా పట్టుకున్నారు. ఇక వారితో పోరాడడం తన వల్ల కాదని భావించిన ఉస్మాన్...'బాబ్బాబు... వదలండ్రా పాకిస్థాన్ పారిపోతాను' అంటూ బతిమలాడ్డం ప్రారంభించాడు. బీఎస్ఎఫ్ జవాన్లు వచ్చేవరకు అతడ్ని అలాగే పట్టుకున్న రాకేష్ కుమార్, విక్రమ్ జీత్, ఇమ్రాన్ వారికి అప్పగించేశారు. ఆ ముగ్గురూ తమ దేశభక్తిని ఆ విధంగా చాటుకున్నారు!

  • Loading...

More Telugu News